ప్రకృతి కాల పరీక్షను తట్టుకొని మనుగడ సాగిస్తున్న ఏకైక భారీ జీవి మొసలి. ఏదో గ్రహ శకలం భూమిని ఢీకొనడమో లేదా అగ్ని పర్వతాలు బద్ధలై లావా పెల్లుబికడం వల్లనో రాక్షసబల్లుల జాతే ఈ భూమి మీద నుంచి కనుమరుగయిపోయింది.కానీ రెండు వేల ఏళ్లుగా మొసళ్లు తమ ఉనికిని నిలుపుకుంటున్నాయి. వీటిలో 23 రకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.నీటిలో ఉన్న మొసలి గజరాజు కన్నా బలశాలే.ఇవి నూరేళ్లకు పైబడి కూడా బతుకుతాయి. ఇలాగే 115 ఏళ్ల పాటు ఓ మొసలి రష్యాలోని జూలో 1997 వరకు జీవించి రికార్డు సృష్టించింది. దాన్ని 1890లో పట్టుకొని అప్పటి నుంచి ఆ జూలో పెంచారు.
సాల్ట్ వాటర్ క్రోకడైల్:ఈ రకం మొసళ్లు బహు ప్రమాదకారులు.ఎక్కువగా ఇవి ఆస్ట్రేలియాలో ఉన్నాయి.మనుషులు కూడా చాలా మందే వీటి బారినపడి మృత్యుపాలయ్యారు.మొసళ్లు ఇతర జలచరాలపై సముద్ర గర్భంలో పరిశోధనలు సాగించే ఆస్ట్రేలియన్ టి.వి. ఎక్స్పర్ట్ స్టీవ్ ఇర్విన్ 2006లో విధి నిర్వహణలోనే స్టింగ్రేస్ దాడిలో చనిపోయారు.మొసళ్లకు కోరల్లాంటి పదునైన పళ్లు 60 నుంచి 80 వరకు ఉంటాయి.అయితే వీటి బలమంతా దవడల్లోనే ఇమిడి ఉంటుంది.జిరాఫీ వంటి పొడవైన జంతువుల్ని సైతం అమాంతం పట్టేసి చంపేయగలవివి.మొసళ్లు ఎక్కువ సేపు నీటిలోనే ఉండడానికి ఇష్టపడుతుంటాయి.వీటి మెదడు పరిమాణం చాలా చిన్నది.పొడవైన తోక బలిష్టమైన పైచర్మంతో ఆకలయినప్పుడు శరవేగంగా ఈది ఇతర జంతువుల్ని చాలా తెలివిగా ఒడిసి పట్టేస్తాయి.చుట్టుపక్కల ప్రదేశాల్ని బాగా గమనించేందుకు వీలుగా వీటి తలభాగంలో ఇరుపక్కల బాగా ఎడంగా కళ్లు అమరి ఉంటాయి.వాసనను బట్టీ జంతువుల జాడను ఇవి గుర్తించి మాటు వేసి మట్టుపెడతాయి.ఒక్కోసారి మొసళ్లు తమ పిల్లల్నీ తినేస్తాయి.వాడైన పళ్లతో దొరికిన జంతువును పట్టి చీల్చేసి కడుపులో వేసేసుకుంటాయివి.ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఆ ఆహారాన్ని క్రమక్రమంగా జీర్ణం చేసుకోగలవు.మళ్లీ కొన్ని నెలలపాటు ఆహారం లేకుండాను జీవిస్తుంటాయి.భారీ జంతువులను వేటాడినప్పుడు మగమొసళ్లు ఆడ మొసళ్ల సహాయాన్ని తీసుకుంటుంటాయి.ఒక్కో మగమొసలికి 10 వరకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాయట.
భారీ మొసలి: ఫిలిప్పీన్స్‌లోని అగుసన్‌లో 2011లోనే జయింట్ క్రోకడైల్‌ను పట్టుకున్నారు. ఇది 2,400 పౌండ్ల బరువుతో 22 అడుగుల పొడవుంది. మొసళ్లు ఈతలో పెద్ద నేర్పర్లేమి కాదట . అయితే 10వేల మైళ్లకు పైగా జలాల్లో ఇవి ఈదుకుంటూ వెళ్లి పోతుంటాయని బ్రిటిష్ జీవశాస్త్రవేత్త డాక్టర్ హామిష్ కాంప్‌బెల్ తెలిపారు. ఇవి ఎస్ ఆకారంలో ఈదుతాయట. మొసళ్లు ఎక్కువగా నదులు,సరస్సులు,అడవుల్లోని వంకలు,మడుగుల్లోను,కొన్ని సముద్ర తీరాల్లోను జీవిస్తాయి.ఎక్కువగా అమెరికా, చైనా, న్యూగునియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మడగస్కర్,పాకిస్థాన్‌ల్లో ఉన్నాయం టున్నారు. మొసళ్లు తమ జీవితకాలంలో అనేకసార్లు తమ పళ్లను వదిలేస్తుంటాయి. మళ్లీ వాటికి కొత్త పళ్లు వస్తుంటాయి. ఆడ మొసలి 10 నుంచి 20 గుడ్లను జలతీరాల్లోని ఇసుక తిన్నెల్లో ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో పెడతాయి. వాటిని 65 నుంచి 95 రోజుల్లో పొదుగుతాయి. ఇవి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి.
క్రోకడైల్ రివర్‌గా దక్షిణాఫ్రికాలోని లింపొపొ నది పేరొందింది. ఆ దేశంలోనే మరో మొసళ్ల నదిగా పుమ్‌లాంగ కూడా గుర్తింపు పొందింది.ఇది క్రూగర్ నేషనల్ పార్క్‌కు సమీపంలో ఉంది. అలాగే మినెసొటలో కూడా క్రోకడైల్ రివర్ ఉంది.
ప్రమాదకర సముద్ర జీవులు: సాల్ట్ వాటర్ క్రోకడైల్, మెరెఈల్స్, బరాకడ, సీస్నేక్స్,స్టోన్ ఫిష్,లయన్ ఫిష్,స్టింగ్ రేస్,బ్లూరింగ్ అక్టోపస్,కోన్‌షెల్స్.మొసళ్ల మాంసం,చర్మం కోసం వేటగాళ్లు ఎక్కువగా వీటిని వేటాడుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య అంతకంతకు తగ్గిపోతోంది.అందుకే 1972 నుంచే భారత్‌లో మొసళ్ల వేటను నిషేధించారు.