ప్రకృతిలో ప్రతి ప్రాణి ఏదో ఒక శక్తిని కల్గినదే.అందుకే ఈ ఆధునిక కాలంలోనూ మనిషి జంతువులపై ఆధారపడుతున్నాడు.ముఖ్యంగా పాతిపెట్టిన బాంబులు ఇతర పేలుడు పదార్థాలను కనుగొనేందుకు ఇప్పటికీ స్నిఫర్ డాగ్‌లను భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి.అంతేందుకు ప్రకృతి విలయాల్ని మనుషుల కంటే ఎంతోముందుగా పసిగట్టి జంతువులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నించడం మనకు తెలిసిందే.ముఖ్యంగా భూకంపాలు,తుపాన్లు,సునామీలు సంభవించనున్న సమయాల్లో పక్షులు,ఇతర మూగజీవాల అసహజ ప్రవర్తనలు ఆ కోవలోనివే.ఆ తరహా ఆపదలు జరిగిన తర్వాత ఆ జీవాల ప్రవర్తనను గుర్తు చేసుకున్నాకే మనకు ఈ విషయం బోధపడింది.అలాగే పాలను నీళ్లను వేరు చేసే హంస జాతి పక్షులు ఒకప్పుడు భారత్‌లో ఉండేవట.ఇప్పుడు మచ్చుకు కూడా ఆ హంసలు ప్రపంచంలో ఏమూలా లేవు.
తెల్ల హంసలు:ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏడు రకాల హంసల్లో ఆరు జాతులు తెల్ల రంగులోనే ఉంటాయి.వీటి మూల జాతి అన్టాడే పక్షి కుటుంబం.ఇప్పుడున్నవి ఎక్కువ శాతం సిగ్నేజాతి కుటుంబానికి చెందినవే.వీటిలో మ్యూట్ స్వాన్‌లే ఎక్కువ.వీటిని సిగ్నస్ ఒలర్‌గాను పేర్కొంటారు.ఇవి దాదాపు 50 అంగుళాల పొడవుంటాయి.వీటిలో మగ వాటిని కాబ్స్‌గా ఆడ హంసల్ని పెన్‌లని పిల్లల్ని సిగ్నెట్స్‌గా పిలుస్తారు.కాబ్స్ 11 నుంచి 15 కేజీల బరువు వరకు ఉంటాయి.పెన్‌లయితే 9 కేజీల బరువు తూగుతాయి.ఇతర పక్షులతో పోలిస్తే వీటి జీవిత కాలం చాలా ఎక్కువనే చెప్పాలి.అడవుల్లో అయితే ఇవి 25నుంచి 50ఏళ్లు కూడా జీవించగలవు. హంసల్లో వూపర్,ట్రాంప్టర్,తుండ్రా,మ్యూట్,బ్లాక్నెక్డ్,బ్లాక్,బెర్విక్,కాస్కార్బా రకాలున్నాయి.తుండ్రా,వూపర్ జాతి హంసలు ఉత్తర అమెరికా,ఉత్తర రష్యా,ఆర్కిటిక్ ఐలాండ్‌ల్లో నివసిస్తాయి.బ్లాక్నెక్డ్,కాస్కార్బా బ్రెజిల్లో బ్లాక్ స్వాన్ ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ల్లో,మ్యూట్ స్వాన్లు ఎక్కువగా యూరప్ దేశాల్లో కనిపిస్తాయి. అయితే ఈ స్వాన్‌లన్నీ కూడా ఎక్కువగా జూ,పార్క్‌లు,బొటానికల్ గార్డెన్స్‌లో మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.హిందువులు చదువుల తల్లిగా సరస్వతిని కొలుస్తారు.ఆ సరస్వతీ దేవీ వాహనం హంస.ఆ దేవి పేరిట సరస్వతి అనే నది కూడా భారత్‌లో ప్రవహించేదట.ఇప్పుడా నదిని ఉపగ్రహాల సహాయంతోనే చూడగలమని కొందరి నమ్మకం. ఆ నది అంతర్లీనంగా ప్రవహిస్తోందని పలువురి భావన.బాహ్యప్రపంచం నుంచి అంతర్థానమైన ఆ నది మాదిరిగానే ఇప్పుడు హంస జాతి భారత్‌లో అదృశ్యమయింది.
కంటి చూపుతోనే ఉప్పు-నీరు వేరు:ప్రస్తుతం భూమిపై మిగిలి ఉన్న ఇతర హంస జాతి పక్షులు కూడా ఉప్పునీటిని,మంచి నీటిని కేవలం కంటి చూపుతోనే గుర్తించే సామర్థ్యాన్ని కల్గి ఉన్నాయి.అవి సముద్రమార్గంలో ప్రయాణించేటప్పడు లేదా ఉప్పు నీటి సరస్సుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో దప్పిక తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ నీటిని తాగుతాయి.అలా తాగిన తర్వాత తలను ఓసారి అటు ఇటు విసిరి ఆ నీటిలోని ఉప్పును ఈ హంసలు విసర్జిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.ఒక్క మ్యూట్ హంసలు తప్పితే మిగిలిన హంస జాతులన్నీ శాకాహారులే.మొక్కలు,చెట్ల బెరడ్లు,కాండాలే వీటి ఆహారం.అంతేగాక కొన్ని హంసలు గోధుమ,మొక్కజొన్న,క్యేబేజీ,గడ్డితోపాటు ఇతర తిండి గింజలను తింటాయి.అంతేనా బిస్కట్లు,రొట్టెలను కూడా ఇవి తింటాయట.మ్యూట్ హంసలు మాత్రం చేపల్ని ఆరగించేస్తాయి.
శత్రువు అంతు చూస్తాయి:ఈ హంసలు గొప్ప పోరాట పటిమగలవి.అవి ఆగకుండా రెక్కల్ని ఆడించడం ద్వారా మన భుజాల్ని సైతం విరగ్గొట్టేంతటి శక్తిగలవట.ఇవి దాదాపు 25వేల ఈకలతో పొడవాటి మెడ,సాలెగూడు మాదిరి వేళ్లు కల్గిన పాదాలతో దృఢంగా శత్రువును ఏ సమయంలోనయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి.వీటి దాడిలో గాయపడ్డ మనుషులూ ఎందరో ఉన్నారని జీవశాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇవి తమను తమ పిల్లల్ని రక్షించుకునేందుకు త్రాచుపాము మాదిరిగా బుస కొడుతూ శత్రువుకు హెచ్చరిక పంపుతాయి.బాతులతో దగ్గర పోలిక గల ఈ హంసలు చచ్చేవరకు పోరాడే గుణంగలవి.ఇవి వేరే జాతి హంసలను కూడా అంత తేలిగ్గా నమ్మవు.ఓ మైలు దూరంలోనే గూళ్లను నిర్మించుకుంటుంటాయి.ఎక్కువగా ఇవి తడి,నీళ్లుండే వాతావరణాన్నే ఇష్టపడతాయి.తడవకు ఇవి 5 నుంచి 10 గుడ్లను పెడతాయి.వాటిని 30 రోజుల్లో పొదుగుతాయి.పిల్లలు తొలుత కాల్వల్లో ఈతను నేర్చుకుంటాయి.ఆ తర్వాత అవి 60 నుంచి 75 రోజుల్లో గాల్లో ఎగురడం నేర్చుకుంటాయి.సముద్రాలు,పర్వత,మైదాన ప్రాంతాలేవయినా ఏకధాటిగా ఈ హంసలు రెండువేల మైళ్లు ఎగురుకుంటూ వెళ్లిపోతాయి.భూమికి రెండువేల అడుగుల ఎత్తున యథేచ్ఛగా ఎగురగలవివి.ఎక్కువగా జులై,ఆగస్ట్‌లోనే ఇవి వలసలు వెళ్తాయి.
-------------------------------------------------------------------------------------------------------------
*సహజకవి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎం.ఎస్.రెడ్డి(87)అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో క(పె)న్నుమూశారు.తన ఇంటిపేరు మల్లెమాలనే కలం పేరుగా చేసుకుని ఆయన ఎన్నో కవితలల్లారు,పలు రచనలు చేశారు.సినిమాల్లో పాటలను రాశారు.హెచ్.ఎం.టి.వి సీఈఓ, ప్రఖ్యాత సంపాదకులు కె.రామచంద్రమూర్తికిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎస్.రెడ్డి ఏకలవ్యుడికి విలువిద్యాభ్యాసంలో గురువులేనట్లే కవిత్వంలో తనకు గురువు ఎవ్వరూ లేరని చెప్పారు.కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఓ సభలో మల్లెమాల కవిత్వానికి ఆశ్చర్యపోయి `ఎక్కడున్నావయ్యా మహాకవి ఇన్నాళ్లు` అనడమే తనకు గర్వకారణమైన ప్రశంసని ఎం.ఎస్.రెడ్డి తెలిపారు.