ప్రకృతిని పరిరక్షించేవి అడవులు. అవి పచ్చగా ఉంటేనే పర్యావరణ సమతౌల్యం సాధ్యం. అలాంటి అడవుల్ని ఓసారయినా చూడాలని వీలయితే అక్కడ గడిపి రావాలని కోరుకోని మనస్సులుండవు. ముఖ్యంగా నేటి యాంత్రిక యుగంలో వీకెండ్స్ ఎంజాయిమెంట్ కల్చర్ అమెరికా తరహా పాశ్చాత్య దేశీయులకే పరిమితం కాలేదు. యావత్ దేశాల ప్రజల్లో నేడు ప్రబలుతోంది. అటువంటి వారిని భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ అడవులు సేదతీర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏపీ విస్తీర్ణంలో ఇవి 23 శాతం పరుచుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ఫారెస్టు అందులో భాగమే. ఇక్కడ ఈస్ట్రన్‌గాట్స్‌లోని అడవుల అందాల్ని ఎంతచూసినా తనివితీరదు.వెదురు చెట్లకు ఈ అడవులు ప్రసిద్ధి. తూర్పు,పశ్చిమ,విశాఖ,ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఈ సుందర అడవులు కొలువుదీరాయి.అనేక పక్షులు,జంతువులు,క్రూరమృగాలకు ఆలవాలం ఇవి.ఇక్కడ నుంచే పేరెన్నికగన్న రాజమండ్రి పేపర్‌మిల్‌కు వెదురు సరఫరా అవుతుంటుంది.ఆ క్రమంలోనే వెదురు రవాణా లారీల్లో అడవుల నుంచి వచ్చేసిన పులి,చిరుతలు రాజమండ్రి నగరంలో హల్చల్ చేసిన ఘటనలూ ఉన్నాయి.
మారేడుమిల్లి అడవి: రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రోడ్డులో ఉందీ మారేడుమిల్లి ఏజెన్సీ గ్రామం.ఈ గ్రామం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరం నుంచే దట్టమైన అడవి మొదలవుతుంది. ఇదో గొప్ప పిక్నిక్ స్పాట్.అక్టోబర్ నుంచి స్వదేశీ,విదేశీ సందర్శకులతో ఈ అడవులు సందడిగా మారతాయి.సందర్శకుల్ని అలరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎపిటిడిసి) తగిన ఏర్పాట్లను చేస్తుంటుంది.శనివారం సాయంత్రానికి సందర్శకులు మారేడుమిల్లికి చేరుకుంటుంటారు. రాత్రి ఈ అడవుల్లోని రిసార్టుల్లోనే వారి బస.వారికి ఫారెస్టు గార్డులు,సాయుధ గిరిజనులే రక్షణ కల్పిస్తుంటారు.కార్తీకవనం,మదనికుంజ్,జలతరంగణి తదితర ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా కనిపిస్తూంటుంది.
వరల్డ్ బ్యాంక్ చేయూత: ఏపీ కమ్యూనిటి ఫారెస్టు మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ చేయూత నందిస్తోంది. తదనుగుణంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతోంది. 250 హెక్టార్లలో వాలి- సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్ ఏరియా అలాగే ముందంజ వేస్తోంది. ఇక్కడ దాదాపు 203 రకాల వైద్య ఉపయోగకర మొక్కల్ని పెంచుతున్నారు. గోదావరి నదిపై పాపికొండల నడుమ జలయానం చేస్తూ సందర్శకులు పులకించిపోతుంటారు. కొండ రెడ్లనే గిరిజనులే ఈ ఏజెన్సీలో అత్యధిక సంఖ్యాకులు. ఈ అడవుల్లో కొండల మాటు నుంచి పొంగి పోర్లే పెద్ద ఏరు వలమూరు. ఇది మూడు పాయలుగా చీలి కొండల నుంచి దిగువనకు పారుతూంటుంది. అలా ఈ ఏరు 30 మీటర్ల ఎత్తు నుంచి పారే ఫాల్స్‌నే అమృతధార అని 15 మీటర్ల ఎత్తు నుంచి మరో కొండ నుంచి జాలువారే నీటిని స్వర్ణధార అని పిలుస్తుంటారు. వీటితోపాటు నీలకంఠేశ్వర వాటర్‌ఫాల్స్ కూడా ప్రసిద్ధి చెందాయి. వలమూరు, సోమిరెడ్డి పాలెం, వాల్మీకి పేట, వనసంరక్షణ సమితి వారు ఎపిటిడిసికి ఇతోధిక సహకారాన్ని అందిస్తున్నారు. ఇక్కడి గిరిజనుల కొమ్ము నృత్యం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
బేంబూ చికెన్ : వెదురు బొంగులో ఉడికించిన కోడి మాంసం రుచి గురించి ఎంత వర్ణించినా తక్కువేనంటారు ఈ ప్రాంత సందర్శకులు. ఉప్పు,పసుపు,కారం,మాసాలాలు దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని మీటరు పొడవాటి పక్వానికి వచ్చిన పచ్చటి వెదురు బొంగులో ఉంచి ఆకులు, మట్టితో అంచులను కప్పేసి నిప్పుల్లో కాలుస్తారు. వెదురు బొంగు పూర్తిగా నల్లగా మాడిపోయే వరకు బాగా కాల్చాక చల్లార్చి పొగలు కక్కుతున్న ఉడికిన ఆ కోడికూరను అడవి చెట్ల ఆకుల్లో పెట్టుకొని లొట్టలేసుకొని తినడం సందర్శకులందరికి నిజంగా మరుపురాని మధురానుభూతే.