విశ్వం వింతల సమాహారం. తరచి చూసేకొద్దీ ఎన్నో అంతు చిక్కని రహస్యాల పుట్ట. శోధించే క్రమంలో చిక్కుముడి వీడని సంగతులెన్నో.అటువంటివే వినీలాకాశంలో అప్పుడప్పుడు కనిపించి మాయమయ్యే ఫ్లయింగ్ సాసర్లు. అమెరికాలోనే తొలుత వీటి ఉనికిని గురించి కథలుగా ఎన్నో వార్తలు 90వ దశకం వరకు అనేకసార్లు వెలువడ్డాయి. భూమిపైనే కాక విశ్వంలోని మరికొన్ని గ్రహల్లోనూ మనబోటి మనుషులున్నారనే నమ్మకం ఇప్పటికీ ఉంది. వారు మనకన్నా చాలా తెలివైన వాళ్లని, వాళ్లు నివసిస్తున్న గ్రహం నుంచే భూమిపైనున్న మన సంగతులన్నింటిని ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారని భావించే వారికి కొదవలేదు. ఆ గ్రహాంతర వాసుల వల్ల ఏదైనా హాని ఎప్పటికైనా మనకు తప్పదా? భూగ్రహంపై వివరాల సేకరణకు ఆ గ్రహాలవాసులు ఫ్లయింగ్ సాసర్లలో భూమిపై తిరుగాడిపోతున్నారా?ఈ ఉహా మన శాస్త్రవేత్తల మదిని శతాబ్దాలుగా తొలుస్తూనే ఉంది. ఆ క్రమంలోనే అసలు భూమిపై మాదిరిగా ఇతర గ్రహాలపై ప్రాణులు ఉనికి ఉందా లేదా అనే కోణంలో విస్తృత పరిశోధనలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ పరిశోధనల పరంపరలో ఎప్పుడూ అమెరికాది ముందంజే.
వండర్ ఫ్లయింగ్ సాసర్: :వాషింగ్టన్లో 1940 దశకంలో తొలిసారిగా ఫ్లయింగ్ సాసర్ దిగిందనే వార్తలు తామరతంపరగా వెలువడ్డాయి.ఇక అప్పటి నుంచి 1990ల వరకు ఈ వార్తలు అడపాదడపా సందడి చేస్తూనే వచ్చాయి.అమెరికా ప్రభుత్వం,సి.ఐ.ఏ,ఎఫ్.బి.ఐ.లు ఆయా సందర్భాల్లో ఈ వార్తల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించాయి.అయితే ఆ దర్యాప్తుల మాటెలా ఉన్నా ఫ్లయింగ్ సాసర్లు భూమిపైకి చేరుకుంటుండడం వాస్తవమేననే వారి శాతం ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి.అన్ ఐడెంటిటీ ఫ్లయిడ్ ఆబ్జెక్ట్(యూఎఫ్ఓస్)గా అమెరికన్లు పిలుచుకునే ఈ ఫ్లయింగ్ సాసర్లు వార్తలపై తమ పదవి కాలాల్లో కార్టర్,రీగన్ తదితర అమెరికా అధ్యక్షులు కూడా ఎంతో మక్కువ కనబరచడం గమనార్హం.ఓ ప్రయివేట్ ఫ్లయిట్ పైలట్ కెన్నెత్ అర్నాల్డ్,వ్యాపారవేత్త 1947 జూన్ 24న తాము ప్రయాణిస్తున్న విమానం నుంచి వాషింగ్టన్ గగనతలంలో దాదాపు తొమ్మిది ఫ్లయింగ్ సాసర్లను చూశామని అప్పట్లో అమెరికా వార్తా సంస్థలకు వెల్లడించారు.అవి గంటకు వెయ్యి మైళ్ల వేగంతో దూసుకుపోతుండడాన్ని చూసి తాము ఆశ్చర్యచకితులమయినట్లు వారిద్దరూ పేర్కొనడం యావత్ ప్రపంచంలో సంచలనాన్ని రేపింది.దాంతో 1948లో అమెరికా ఎయిర్ఫోర్స్ జనరల్ ట్వినింగ్ ఆధ్వర్యంలో ఎస్.ఐ.జి.ఎన్(ప్రాజెక్టు సాసర్)పేరిట ఫ్లయింగ్ సాసర్లపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.ఇంతకీ వీటికి ఫ్లయింగ్ సాసర్లనే పేరు ప్రత్యక్షసాక్షులు అందించిన వివరాల ఆధారంగానే వచ్చింది.అర్నాల్డే కాకుండా ఈ తరహా ఎగిరే పళ్లాలను ఆయా దేశాల్లో చాలామంది చూశారనే వార్తలు అనేకం 1950 దశకం తర్వాతే బోలెడు వెలువడ్డాయి.వారందరూ చెప్పినదాన్నిబట్టే ఈ ఎగిరే పళ్లాలకు ఫ్లయింగ్ సాసర్,ఫ్లయింగ్ డిస్క్,పైప్లేట్ అనే పేర్లు స్థిరపడ్డాయి.ఇటీవల 2006లో షికాగో ఒహరె ఎయిర్పోర్టు సమీపంలోనూ ఓ ఎగిరే పళ్లెం వార్త హల్చల్ చేసింది.అలా మెరిసి ఇలా అదృశ్యమయ్యే ఎగిరే పళ్లాల వార్తలే గానీ అందులో నుంచి ఏవో జీవులు భూమిపై అడుగిడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారెవరూ ఇంతవరకు వార్తలకెక్కలేదు.అయితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో మాత్రం ఈ ఏడాది ఆరంభంలో ఓ భారీ మనిషి పాదముద్రల గురించి వార్తలు గుప్పుమన్నాయి.కొందరు స్థానికులయితే ఏకంగా తాము గ్రహాంతర వాసిని అతి సమీపం నుంచి చూశామని టి.వి.చానళ్లకు తెలిపారు.తెల్లటి పొగమంచు తెరలా ఆ మానవాకార గ్రహాంతర వాసి తమ కళ్ల ముందు నుంచి వేగంగా కదిలి వెళ్లిపోవడంతో భయభ్రాంతులకు లోనయ్యామని వారు తమ అనుభవాన్ని పంచుకున్నారు.ఈ వార్తల్లో నిజానిజాల సంగతెలా ఉన్నాఎగిరే పళ్లాలు,గ్రహాంతరవాసులు,ఇతర సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎప్పుడు విడుదలయినా ప్రపంచవ్యాప్తంగా జనరంజకంగా ప్రదర్శితమవుతున్నాయి.
వరల్డ్ టాప్ టెన్ యూఎఫ్ఓ సినిమాలు:1. Earth vs. the Flying Saucers(1956),2. War of the Worlds(1953),3. Independence Day(1996),4. Episode..20(Destruction) from the British TV series: UFO(1970),5. The Battle in Outer Space(1959),6. Close Encounters of the Third Kind(1977),7. This Island Earth(1955),8. Mars Attacks!(1996),9. Invaders from Mars(1953, 1986),10. The Day the Earth Stood Still(1951).