14 Dec 2011

venice


భూమిపై ప్ర‌స్తుతం మూడొంతుల భాగం నీరే.ఆ నీరే స‌క‌ల జీవ‌జాలానికి ప్రాణాధారం.కానీ మ‌నుషులు,ఎక్కువ శాతం జీవ‌జాలం భూమ్మీద‌నే జీవిస్తోంది.అయితే రొటిన్‌కు భిన్నంగా వింత అనుభూతులు,స‌రికొత్త ఆనందాల‌ను కోరుకునే మ‌నుషులు చాలా మందే ఉన్నారు.అందుకే నేటికీ నౌకా ప్ర‌యాణాల‌పై మ‌క్కువ చూపేవారు,న‌దులపై బోటు షికార్ల‌ను చేసేవారి సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.యావ‌జ్జీవిత‌కాల‌మూ ఆ నీటిపైనే ఆవాసాలు ఏర్ప‌రుచుకొని నివ‌సిస్తున్న వారున్నారంటేనే ఆశ్చ‌ర్యం క‌ల్గిస్తోంది..నిజంగా అద్భుత‌మ‌నిపిస్తుంది.ఆ సంభ్ర‌మానికి వేదిక ఇట‌లీలోని వెనిస్ న‌గ‌రం.నీళ్ల‌పై తేలియాడే గొలుసుక‌ట్టు ప్రాంతాల స‌మాహారం ఈ వెనిస్‌.అందుకేనేమో ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడే న‌గ‌రాల జాబితాలో చోటు ద‌క్కించుకుందిది.
నీటిపై అందాల ఇళ్లు:వెనిస్ న‌గరానికి వెనిజియా అనే పేరూ ఉంది.118 దీవుల స‌ముదాయ‌మిది.అయిదో శ‌తాబ్దంలోనే రూపుదిద్దుకున్న న‌గ‌రం.ఈ వెనిస్ ముఖ‌ద్వారం వ‌ర‌కే రోడ్డు,రైలు,విమానాశ్ర‌య సౌక‌ర్యాలు ఉంటాయి.వెనిస్ నుంచి దీవుల్లోకి ప్ర‌యాణించేందుకు వాట‌ర్ టాక్సీలే ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఇళ్లు,హోట‌ళ్లు,షాపింగ్ మాల్స్‌,వ‌ర్త‌క‌,వాణిజ్య కార్య‌క‌లాపాల స‌ముదాయాలు త‌దిత‌రాల‌న్నీ నీళ్ల‌పై నిర్మించిన క‌ట్ట‌డాల్లోనే జ‌రుగుతాయి.అక్క‌డ‌క్క‌డ నేల క‌నిపించినా మొత్తం నీళ్లే ప‌రుచుకుని ఉంటాయి.అడ్రియాటిక్ స‌ముద్ర తీర జ‌లాలు,పొ,పేవ్ న‌దీ జ‌లాల ప్ర‌వాహంపై ఏర్పాట‌యిన అత్యంత విలాసవంత‌మైన న‌గ‌రమే వెనిస్‌.ప్ర‌కృతి అందానికే నిర్వ‌చ‌నంగా తేలుతున్న ఈ న‌గ‌రానికి రోడ్డుమార్గం మాత్రం లేదు.అయితేనేం ఎటు చూసినా క‌ళాత్మ‌క‌త ఉట్టిప‌డే క‌ట్ట‌డాలే.వ్యాపార‌,వాణిజ్యాల జోరు అనంత‌మే ఇక్క‌డ‌.మూడు ల‌క్ష‌ల జ‌నాభా ఈ క‌ద‌లాడే న‌గ‌రంపై జీవిస్తున్నారు.అయితే త‌రుచు వీరికి వ‌ర‌ద‌ల బెడ‌దే.ముఖ్యంగా 1966లో వ‌చ్చిన వ‌ర‌ద‌లు వీరికి వీడ‌ని పీడ క‌ల‌నే మిగిల్చాయి.ఆ ఏడాది నీటి మ‌ట్టం 1.94 మీట‌ర్ల మేర పెర‌గ‌డంతో ప‌లు చారిత్ర‌క క‌ట్ట‌డాలు సైతం దెబ్బ‌తిన్నాయి.గ‌డిచిన శ‌తాబ్దం నాటికే ఈ తీర న‌గ‌ర ప్రాంతం 23 సెంటీమీట‌ర్ల మేర కుంగిపోయింద‌ట‌.ఈ న‌గ‌రం నీట మున‌గ‌డానికి ఇక ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చాలాకాలంగా హెచ్చ‌రిస్తూనే ఉన్నారు.స్పందించిన ఇట‌లీ ప్ర‌ధాని సిల్వియో బెర్లుస్కోని 2003లో ఎం.ఎస్‌.ఇ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశారు.పొటెత్తే స‌ముద్ర జ‌లాలు ఈ న‌గ‌రాన్ని త‌న‌లో క‌లిపేసుకోకుండా ప‌టిష్ట‌మైన బేరియ‌ర్స్‌ను ఏర్పాటు చేయ‌డ‌మే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది.
క‌ద‌లాడే క‌ట్ట‌డాలు:నీటిపై తేలియాడే ఇళ్లు.. అందులో జ‌నం నివాసం.. ర‌ద్దీగా సాగే వ్యాపార‌,వాణిజ్య కార్య‌క‌లాపాలు.. ప‌ర్యాట‌కుల‌తో సంద‌డి..ఎలా ఇదంతా..? అదే మరీ మాన‌వ‌మేధ సృష్టించిన సంభ్ర‌మం.మెరైన్ ఇంజ‌నీరింగ్ నైపుణ్యం మ‌న‌ముందు ఈ వాస్త‌వాన్ని అందంగా ఆవిష్క‌రించింది.నీటిలో చాలా లోతు వ‌ర‌కు తేలియాడే పైపుల‌ను అమ‌రుస్తారు. ఈ పైపుల‌ను ఒక‌దానికొక‌టి అనుసంధానించి బేస్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తారు. దానిపై క‌ట్ట‌డాల‌ను నిర్మిస్తారు. దాదాపు ఇళ్ల‌న్నింటిని క‌ల‌ప‌తోనే తీర్చిదిద్దుతారు. చూడ్డానికి ఇవి అచ్చం కాంక్రీట్ భ‌వ‌నాల‌నే త‌ల‌పిస్తాయి. మూడు మీట‌ర్ల మేర నీటి ప్ర‌వాహం పెరిగినా ఈ ఇళ్లు ఒరిగిపోవ‌డం లేదా కొట్టుకుపోవ‌డ‌మో జ‌ర‌గ‌దు. ఇళ్లు క‌ద‌లాడ‌తాయి,కానీ లోప‌ల వ‌స్తు సామ‌గ్రికి గానీ జ‌నానికి గాని ఏ మాత్రం కుదుపు ఏర్ప‌డ‌క‌పోవ‌డం విశేషం. స‌ముద్ర ఆట‌పోట్ల ప్ర‌భావం,న‌దుల వ‌ర‌ద‌లు తాకిడి లేకుండా అనేక బేరియ‌ర్ ప్రాజెక్టులను వెనిస్ పాల‌కులు శ‌తాబ్దాల నాడే నిర్మించారు.
క‌ళ‌ల‌కు పుట్టిల్లు : సంగీతంతో స‌మ్మిళిత‌మైంది..క‌ళ‌ల‌కు పుట్టినిల్లు వెనిస్ అని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వెనిస్ ఫిలిం ఫెస్టివ‌ల్‌నే అందుకు ఉదాహ‌ర‌ణ‌.అంటానియో వివ‌ల్డి జ‌న్మించిందిక్క‌డే.యూర‌ప్‌లోనే ప్ర‌ధాన వాణిజ్య కేంద్రాల్లోను వెనిస్ ఒక‌టి.ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోనూ ఈ న‌గ‌రం ఇప్పుడు ముందంజ‌లోనే ఉంది.ఏటా ఇక్క‌డ‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు 30 ల‌క్ష‌ల పైమాటే.వెనిస్‌,టెర‌ఫెర్మా,ఫ్రెజియని,మ‌ర్గెరా,పౌడ,ట్రెవిస్ జ‌లావాసాల్లోనే జ‌నం ఉంటున్నారు.ఈ ప్రాంతాల‌న్నీ వెనిస్ న‌గ‌ర పాలిక కింద‌కే వ‌స్తాయి.ఇట‌లీలోని ఈ న‌గ‌రం స్వ‌యంప్ర‌తిప‌త్తి గ‌ల‌ది.మేయ‌ర్ గిర్గియో ఒర్సోని 2010 డిసెంబ‌ర్‌లో అధికారానికి వ‌చ్చారు.మ‌రో 45 మంది స‌భ్యులున్నారు.వీరంద‌రూ గ్రేట్ కౌన్సిల్ కింద‌కు వ‌స్తారు.వీరంద‌రూ సెనెట్‌కు 200 నుంచి 300 మంది ప్ర‌తినిధుల్ని,ఇత‌ర అధికార గ‌ణాన్ని నియ‌మిస్తారు.ప‌ర్యాట‌కులు,స్థానికులు 117 కెనాల్స్ ద్వారా ఇక్క‌డ గ‌ల వివిధ ద్వీపాల‌కు చేరుకుంటుంటారు.330 నౌక‌లు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.3300 మంది సెయిల‌ర్లున్నారు.ఈ వాట‌ర్ సిటీలో వాట‌ర్ టాక్సీలే ప్ర‌ధాన వాహ‌నాలు.ప్ర‌తి ప్రాంతంలో కెనాల్స్‌,వంతెన‌లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.ఇందులో పేరొందింది రియ‌ల్టో బ్రిడ్జి.ఇది 14వ శ‌తాబ్దంలోనే నిర్మిత‌మ‌యింది.ఈ ప్రాంతం షాపింగ్‌కు,బొటెక్స్‌కు ప్ర‌సిద్ధి.వెనిస్‌లో భాష వెనెటియ‌న్‌.ప్ర‌ధాన‌మ‌తం రోమ‌న్ కేథ‌లిక్‌.హిందూ,ముస్లిం,బౌద్ధ మ‌తాల‌కు చెందిన వారు నివ‌సిస్తున్నారు.జ‌న‌వ‌రిలో ఉష్ణోగ్ర‌త 2.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయి.జులై నుంచి ఏడాది చివ‌ర వ‌ర‌కు 22.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటాయి.వెనిస్ న‌గ‌ర ముఖ‌ద్వారం వ‌ద్ద మార్కోపోలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు ఉంది.ఇక్క‌డ నుంచి వెనిస్ ప్ర‌ధాన ద్వీపానికి మార్గం ఉంది.ట్రెవిసోలోగ‌ల విమానాశ్ర‌యం నుంచి వెనిస్‌కు 30 మైళ్ల దూరం. 

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays