(you can see other posts from this blog,go through with mozilla
firefox/google
chrome)
రష్యా ఓ అమేయ శక్తి...అగ్ర రాజ్య అరుణ పతాక..... అంతరిక్షం నుంచి ఆయా రంగాల వరకు ముందుండి తనదైన ముద్ర వేసిన దేశం. కానీ సోవియట్ యూనియన్ 1991లో అంతర్థానమైన నేపథ్యంలో రష్యా ఒక్కసారిగా అతలాకుతలమయింది. లెనిన్, స్టాలిన్, బ్రెజ్నెవ్ తదితర మేరునగ ధీరులు పరిచిన బాటలు బదాబదలై ఏకంగా దేశమే కుదేలయింది. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు గోర్బోచేవ్ అమలు చేసిన గ్లాస్‌నోస్త్, పెరెస్త్రోయికా సంస్కరణల ఫలాల మాటేమో గానీ యావత్ రష్యా అనేక సమస్యల వలయాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడిగా ఎల్సిన్ జమానా వెలవెలబోయిన తరుణంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక తిరోగమనం అగ్రదేశాన్ని కాస్తా అయ్యో అనే స్థితికి తీసుకువచ్చాయి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న సగటు రష్యన్లకు అసలు సిసలైన సాహసి దొరికాడు.అతనే స్టాల్‌వార్ట్ పుతిన్.
Boy Putin |
సాహస నాయకుడు పుతిన్:`స్టాల్‌వార్ట్`పుతిన్ ఇది రష్యన్లు తమ అధ్యక్షుడికి ఇచ్చిన కితాబు కాదు.పుతిన్‌ను ఉద్దేశిస్తూ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు నోటివెంట వెలువడిన ప్రశంస అది.2007లో జి-8 దేశాల సదస్సు సాక్షిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ టెర్రరిజం అణచివేతలో రష్యా అధ్యక్షుడైన పుతిన్ సామర్థ్యాన్ని అభినందిస్తూ ఈ కాంప్లిమెంట్ ఇచ్చారు.రుబుల్ పతనంతోపాటు విచ్ఛిన్నపుటంచుల్లో నిలిచిన దేశాన్ని సమైక్యంగా సుస్థిరంగా ఆర్థిక పురోగమన మార్గంలో నడిపించిన సమర్థనేత పుతిన్.అందుకే 59 ఏళ్ల పుతిన్‌కే మూడోసారి తిరుగులేని మెజార్టీతో ఆదేశ ప్రజలు పట్టం కట్టారు.ఎల్సిన్ చేసిన మంచిపనుల్లో మొదటిగా చెప్పుకోవాల్సిందేమంటే తన ప్రధానుల కూటమిలోకి పుతిన్‌ను తీసుకోవడమే.లా పట్టాను పొందడమే కాక కె.జి.బి సర్వీసులో ఉన్న పుతినే భావి రష్యా పథ నిర్దేశికుడిగా ఆనాడే ఎల్సిన్ గుర్తించడం ఆ దేశానికి ఎంతో మేలునే చేసింది.తొమ్మిదేళ్లు తిరక్కుండానే 1999లో తొలుత రష్యా తాత్కాలిక అధ్యక్షుడిగాను ఆ తర్వాత నాలుగు నెలలకే జరిగిన ఎన్నికల్లో గెలిచి దేశ అధ్యక్షుడిగా పుతిన్ బాధ్యతలు చేపట్టారు.మళ్లీ 2004లోనూ ఆయనే అధ్యక్షుడు. రష్యా నిబంధనల ప్రకారం వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా పీఠం ఎక్కే అవకాశం లేకపోవడంతో ప్రధానిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 2008 నుంచి మళ్లీ ఇప్పుడు అధ్యక్షుడు అయ్యే వరకు దేశ సంక్షేమం కోసం నిరంతరం పోరాడారు.
రష్యా పూర్వవైభవం:రష్యాకు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందంటే అది పుతిన్ హయాం వల్లే అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.ఆ దేశ ప్రస్తుతాభివృద్ధిలో ఆయన పాలనా ముద్ర అంతగా పడింది.ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్‌లో రష్యా ఇప్పుడు తిరుగులేని శక్తి.ఆయిల్,నేచురల్‌గ్యాస్,ఖనిజాల ఎగుమతుల్లో ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.ప్రపంచ భూభాగంలో రష్యాది మొదటిస్థానం.ఆ దేశంలో మొత్తం 9 టైంజోన్‌లు ఉన్నాయి.రష్యా భూభాగంలో 60 శాతం నార్తరన్‌ఆసియాలో 40 శాతం యూరప్‌లోను విస్తరించి ఉంది. జనాభాలో తొమ్మిదో పెద్ద దేశమైన రష్యా ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశం.ఐ.ఎం.ఎఫ్ తాజా నివేదిక ప్రకారం అత్యధిక జి.డి.పి గల దేశాల జాబితాలో 11వ స్థానంలో ఉంది.అంతరిక్ష పరిశోధనలు,అణుపాటవ,సైనికశక్తిలో రష్యా సామర్థ్యం తిరుగులేనిదే. రష్యా మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందనడానికి ఆ దేశంలో పెరిగిన కొనుగోలు శక్తే తిరుగులేని ఉదాహరణ.ఇక పుతిన్ అధ్యక్షుడిగా పదవిలో ఉన్న కాలం 1999 నుంచి 2008 మధ్య ఆ దేశంలో జి.డి.పి శాతాలు వరుసగా 6.5,10,5.7,4.9,7.3,7.2,6.4,8.2,5.2 గా నమోదయ్యాయి.పేదరికం శాతం 14కు తగ్గింది.జూడోలోనూ నిపుణుడైన పుతిన్ నిస్సందేహంగా గొప్ప సాహసి.
లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ అంటారు.పుతిన్ అలా తిరుగులేని నాయకుడిగా ఎదగడంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారకులైన వారిలో లెనిన్‌గ్రాడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనతోలి సొబ్చాక్ ఒకరు.సొబ్చాక్ లెనిన్‌గ్రాడ్ మేయర్‌గా పదవిలో ఉన్నప్పుడు కూడా పుతిన్‌ను ప్రోత్సహించారు.తనకు ప్రత్యామ్నాయం చూపగలిగినవాడే నిజమైన నాయకుడని పెద్దలంటారు.భవిష్యత్‌లో ఆ పని చేయాల్సిన బాధ్యత పుతిన్‌పైనే ఉంది.
No comments:
Post a Comment