హ్యాట్సాఫ్ యువ
ఫౌజా సింగ్ భారత సంతతికి చెందిన 100 ఏళ్ల నవయువకుడు. సాధించిన ఘనత ఏంటో తెలుసా? టొరంటోలో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్ రేసును 8 గంటల్లో అధిగమించడం ద్వారా లక్ష్యాన్ని అందుకొని గిన్నీస్‌బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
హంటా(ర్)
ఇదేమిటి? ఇదో ప్రాణాంతక వ్యాధి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ మహిళ ఈ వ్యాధికి బలయ్యారు. ఎలుకల ద్వారా ప్లేగు వ్యాధితోపాటు ఈ హంటా
వ్యాధి కూడా ప్రబలుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. తీవ్ర జ్వరం, తల,కీళ్ల నొప్పులతో బాధితులు మరణిస్తారు. ఎలుకల మూత్రం నీళ్లలో కలిసి కలుషితమవుతున్న సందర్భాల్లోను, వాటి మలం మట్టిలో కలవడం వల్ల ఈ వైరస్ ప్రబలి జనానికి సోకుతుంది.
___________________________________________________________
అన్నా`హజార్` !
అన్నా ఆ పేరులోనే ఉంది సోదరభావం. కోట్లాది భారతీయుల్ని కదిలించే రూపం. హావాభావం ఆయన సొంతం. నెత్తిన గాంధీ టోపీ..ఒంటిపై ఖద్దరు వస్త్రాలు..అసలు సిసలైన గాంధేయవాది. ఆచరణలోనూ అదే త్రికరణశుద్ధి. తన జీవితమే సందేశమన్నారు గాంధీజీ..తన పంథానే అందరికీ మేలు బాటగా ముందుకు ఉరుకుతున్నారీ హాజారే. మహారాష్ట్రలోని రాలేగాంసిద్ధినే అందుకు ప్రబల సాక్ష్యం. దేశం కోసం గ్రామాల్లోనే ఉందన్న బాపూజీ మాటనే వారికి వేద మంత్రం. తన స్వగ్రామం అభివృద్ధిని సాధించారు. చీకటిని తిడుతూ కూర్చునేకంటే చిరుదివ్వెను వెలిగించడం మంచిదని ఆచరించి చూపించారు. జాతిపిత సిద్ధాంతాల వల్లెవేత కాదు. అమలుకు కంకణబద్ధులైన అన్నా జాతికి స్ఫూర్తి ప్రదాత. అవినీతికి వ్యతిరేకంగా ప్రస్తుతం సమరశంఖం పూరించిన ఈ అభినవ గాంధీ అందుకు మరో స్వాతంత్ర్య సంగ్రామం అవసరమంటున్నారు. ఈ పోరులో ఏ రాజకీయ పక్షానికి అవకాశమివ్వక జనలోక్‌పాల్ కోసం నిరశన చేపట్టి పాక్షిక విజయాన్ని జాతికి ప్రోది చేసిపెట్టారు. దేశ రాజధానిలోని రాంలీలామైదాన్ వేదికగా పోటెత్తిన జనావళి అదే ఒరవడికి మున్ముందూ కంకణబద్ధమై చేయూతనిస్తేనే దాదాపు సగభాగం ఉన్న నిరుపేద భారతానికి అభ్యున్నతి. మెరుగైన జీతాల కోసం విదేశాలకు వలసలు భారీగా జరుగుతుండడంతో ఇప్పటికే బ్రెయిన్ డ్రెయిన్‌తో నష్టపోతున్న భారత్‌కు నల్లధనం మరో తీరని నష్టం. లక్షా 82 వేల కోట్ల డాలర్ల నల్లధనం ఈ విధంగా పరాయిగడ్డపై మూలుగుతోందని ఓ అంచనా. దేశం మేధో వలసల వల్ల పాక్షికంగా నష్టపోతుండగా అవినీతి, పోగుపడిపోతున్న నల్లధనం యావత్ దేశాభివృద్ధికి అగాధమే అవుతోంది. ప్రవాస భారతీయులు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న మనవాళ్లు అక్కడ సంపాదించిన సొమ్ముతో ఇక్కడ ఇతోధిక ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినన్న రాయప్రోలు సుబ్బారావు మాటకు ఎన్ఆర్ఐలు ప్రతీకలవుతున్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను అక్కడా పాటిస్తూ వారు శభాష్ అనిపించుకుంటున్నారు. అందుకు భిన్నంగా ఇక్కడ అవినీతి అక్రమాలతో సంపాదించిన నల్లధనాన్ని విదేశాల్లో దాచుకొనే ఘరానాల వల్లే దేశం ఇంకా తృతీయ ప్రపంచ దేశాల జాబితాలోనే మిగిలిపోతోంది. అవినీతి ఆటకట్టుతోపాటు నల్లధనం మళ్లీ దేశ జనావళికి తిరిగి దక్కేందుకు ఉద్యమం సాగాలి. వీటన్నిటి దృష్ట్యానే అన్నా తన నిష్కళంక జట్టుతో ముందడుగు వేస్తున్నారు. దేశంలో తొలి మహిళా ఐపిఎస్ అయిన కిరణ్‌బేడి చేపట్టిన జైళ్ల సంస్కరణలు, విధినిర్వహణలో చూపిన తెగువ ఆమెకు తిరుగులేని కీర్తిని సంపాదించపెట్టాయి. ఫిలిప్పైన్స్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డుతోపాటు పలు రివార్డులు బేడి సొంతమయ్యాయి. అన్నా టీంలో మరో ముఖ్య సహచరుడు అరవింద్ కేజ్రీవాల్ ఐఎఫ్ఎస్. ఆయనా సేవాభావం, సమర్థ విధి నిర్వహణతో రామన్ మెగసెసే అవార్డుతోపాటు పలు అవార్డులు, రివార్డులనెన్నింటినో పొందారు. తండ్రీ తనయులు శాంతి, ప్రశాంత్ భూషణ్‌లు దేశంలోనే లబ్ధ ప్రతిష్టులైన న్యాయవాదులు. గాంధీజీ ఆశయసాధనకు దిశానిర్దేశకులైన అన్నాజట్టుతో యావత్ దేశ యువత జతకడితేనే జనం కల సాకారం అవుతుంది. 2050 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందగలదు.
...........................................................................................................................................................................................................................
- జనచేతన యాత్రను ప్రారంభించిన 80 ఏళ్ల బీజేపీ అగ్రనేత అద్వానీ ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్నారు.
No comments:
Post a Comment